గృహ నిర్భంధంలో జోర్డాన్‌ మాజీ యువరాజు

Former Prince of Jordan under house arrest. జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం పుట్టింది. దేశంలో అవినీతి

By Medi Samrat  Published on  5 April 2021 3:27 AM GMT
Former Prince of Jordan

జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం పుట్టింది. దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని, వాక్‌ స్వాతంత్య్రం కొరవడిందని, పాలన అస్తవ్యస్తంగా సాగుతోందంటూ రాజు అబ్దుల్లా-2 సవతి సోదరుడు ప్రిన్స్‌ హంజా బిన్‌ హుస్సేన్‌ బహిరంగ విమర్శలు చేశారు.దీంతో తిరుగుబాటుకు కుట్ర పన్నారనే అభియోగంపై ప్రిన్స్‌ హంజా బిన్‌తో పాటూ రాజకుటుంబానికి చెందిన 20 మందిని అమ్మాన్‌లో నిర్బంధంలోకి తీసుకున్నారు.

రాజు తీరుపై విమర్శలు చేస్తూ హంజా ఒక వీడియోను విడుదల చేశారు. శనివారం ఉదయం జోర్డాన్‌ సైన్యాధిపతి తన వద్దకు వచ్చారని, ఇక నుంచి తాను ఇల్లు దాటడానికి వీల్లేదని, ప్రజలను కలవడానికి, వారితో మాట్లాడటానికి అనుమతించబోమని స్పష్టంచేసినట్లు ఆరోపించారు. తనకు ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని చెప్పారు. తన తాజా సందేశాన్ని రికార్డు చేయడానికి శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించానని, దాన్ని కూడా కట్‌ చేయబోతున్నారని తెలిపారు.

రాజు పేరు ప్రస్తావించకుండానే పాలనా వ్యవస్థపై ఆయన విమర్శలు చేశారు. దేశ ప్రజల జీవితాలు, భవిష్యత్‌ కన్నా స్వీయ ప్రయోజనాలు, అవినీతికే ప్రాధాన్యం దక్కుతోందని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా తాను కుట్రలు పన్నానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అక్రమాలను ప్రశ్నించేవారిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇక్కడ ఆనవాయితీయేనని చెప్పారు. హంజాను గృహ నిర్బంధంలో ఉంచినట్లు వచ్చిన ఆరోపణలను సైన్యాధిపతి జనరల్‌ యూసఫ్‌ హునైటీ ఖండించారు. దేశ భద్రత, సుస్థిరతకు హాని కలిగించే చర్యలకు స్వస్తి పలకాలని మాత్రమే ఆయనకు సూచించినట్లు తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందని, అందులో తేలిన అంశాలను బహిర్గతం చేస్తామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన నాయకులను హంజా రెచ్చగొడుతున్నారని ఉప ప్రధాన మంత్రి అయమన్‌ సఫాది ఆరోపించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ సంస్థలతో కలిసి కుట్ర పన్నుతున్నారని కూడా చెప్పారు. జోర్డాన్‌లో తిరుగుబాటు కుట్రను భగ్నం చేశామని, ఆ వ్యవహారంలో ప్రమేయమున్న 14-16 మందిని అరెస్టు చేసినట్లు మరో సీనియర్‌ అధికారి తెలిపారు. నిజానికి హంజాకు జోర్డాన్‌లో మంచి ప్రజాదరణ ఉంది. తన తండ్రి, దివంగత రాజు హుస్సేన్‌కు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉండేవారు. 1999లో ఆయనకు యువరాజు (క్రౌన్‌ ప్రిన్స్‌) హోదాను కట్టబెట్టారు. వయసు తక్కువగా ఉండటం, అనుభవరాహిత్యం కారణంగా ఆయనకు సింహాసనం మాత్రం దక్కలేదు. సవతి సోదరుడు అబ్దుల్లాకు పట్టాభిషేకం జరిగింది. 2004లో అబ్దుల్లా.. హంజాకు యువరాజు హోదాను తొలగించారు.

అయితే అబ్దుల్లా తమకు కీలక మిత్రుడని, ఆయనకు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, యూఏఈ, ఇజ్రాయెల్‌ తదితర మిత్ర దేశాలు కూడా రాజుకే మద్దతు పలికాయి. తాజా పరిణామాలతో రాజ ప్రాసాదం చుట్టూ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. జోర్డాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం, దీనికి తోడు కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలే స్థితికి వచ్చింది. రాజు అబ్దుల్లాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల్లో రోసిపోయిన ఈ నిరంకుశ, రాచరిక ప్రభుత్వం అమెరికా దన్ను చూసుకుని ఇష్టానుసారంగా చెలరేగుతున్నది.



Next Story