జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో తీర్పు.. కీలక వ్యాఖ్యలు చేసిన జో బైడెన్
Joe Biden about Floyd Murder case. జార్జ్ ఫ్లాయిడ్ హత్య తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని
By Medi Samrat Published on 21 April 2021 10:31 AM GMTఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు.. ప్రపంచం మొత్తం సంచలనం అయింది. అమెరికాలో నల్లజాతి వారిపై జరుగుతున్న దాడులను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ ఘటన. గతేడాది మే 25న పోలీసు అధికారి డెరెక్ చేతిలో ఫ్లాయిడ్ మరణించాడు. ఫ్లాయిడ్ మెడను మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా డెరెక్ కాలు తీయకపోవడానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు మాజీ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు తాజాగా దోషిగా ప్రకటించింది. ఫ్లాయిడ్ హత్యను సెకండ్, థర్డ్ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొన్న న్యాయస్థానం శిక్షను త్వరలో ఖరారు చేయనుంది. తీర్పు సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్ద గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఫ్లాయిడ్ హత్య సమయంలో దోషి డెరెక్‌తోపాటు ఉన్న మిగతా ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. ఆగస్టు నుంచి వారిపై విచారణ జరగనుంది.
ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ రోజు వచ్చిన తీర్పు మంచి సందేశాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. ఇది సరిపోదని, ఇక్కడితోనే మనం ఆగిపోకూడదని, వ్యవస్థలో నిజమైన మార్పు తీసుకురావాలని అన్నారు. ఇటువంటి విషాద ఘటనలు తగ్గించేలా మనం తప్పక కృషి చేయాలని.. తనకు శ్వాస ఆడటం లేదంటూ జార్జ్ చేసిన వ్యాఖ్యలను మనం నిత్యం గుర్తుంచుకోవాలని అన్నారు. ఆయన హత్య కేసులో నేడు వచ్చిన తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో గొప్ప ముందడుగని తెలిపారు.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించారు. బాధిత జార్జ్ కుటుంబ సభ్యులను అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వైట్ హౌస్‌కు పిలిపించి మాట్లాడారు.