ఇటీవల అమెరికాకు చెందిన టెకీ సంస్థలపై రాన్సమ్ వేర్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాన్సమ్ వేర్ దాడులను అడ్డుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ రాన్సమ్‌వేర్ దాడులు రష్యా నుంచే జరుగుతున్నట్టు తమవద్ధ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఈ దాడుల వెనుక ప్రభుత్వం లేకున్నా.. ఎవరు చేస్తున్నారో తెలుసుకొని, తాము సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలని జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు.
'రష్యా నుంచే ఈ దాడులు జరుగుతున్నాయని పుతిన్‌కు స్పష్టంగా చెప్పాను. ఈ దాడుల వెనుక ఆ ప్రభుత్వం లేకపోయినా.. ఎవరున్నారో తెలుపుతూ మేం తగిన సమాచారమిస్తే.. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాను.' అని బైడన్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో రష్యాతో సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను నెలకొల్పామన్నారు. కాగా.. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొంటున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం వలన.. పరిస్థితులు తిరిగి గతంలో మాదిరిగా మారిపోయో అవకాశం ఉంటుంది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత అమెరికా, రష్యా దేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.