సాధారణంగా నేతలు వివిధ వేదికలపై ప్రసంగాలు చేసేటప్పుడు ఏక ధాటిగా మాట్లాడుతూనే ఉంటారు. అయితే.. వారు అంత సేపు అన్ని గుర్తించుకుని ఎలా మాట్లాడుతుంటారా..? అని ఆశ్చర్యపోతుంటారు కొందరు. నిజానికి చాలా మంది నేతలు టెలిప్రాంప్టర్ చూస్తూ ప్రసంగిస్తుంటారు అన్న సంగతి కొద్ది మందికే తెలుసు. అలా టెలిప్రాంప్టర్ చూస్తూ ప్రసంగిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగంలో పొరపాటున టెలిప్రాంప్టర్ సూచనను సైతం లైవ్‌లో చదివేశారు. ఇంకేముంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. అత్యవసవర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకున్న హక్కునుకాపాడుతూ జో బైడెన్ శుక్రవారం పాలనా ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బైడెన్ ప్రసంగించారు. ప్రసంగం సమయంలో 'ఎండ్ ఆఫ్ కోట్, రిపీట్ ది లైన్' అనే సూచనను లైవ్‌లో బిగ్గరగా చదివారు. ఆ తర్వాత టెలిప్రాంప్టర్ లో చూస్తూ చదివేందుకు బైడెన్ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించినా.. తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్ విమర్శనాత్మకంగా స్పందించారు. 'టెలిప్రాంప్టర్‌ను ఎవరు నియంత్రిస్తారో వారే నిజమైన అధ్యక్షుడు 'అంటూ 'యాంకర్ మ్యాన్ ది లెజెండ్ ఆఫ్ రాన్ బుర్గుండీ' అనే సినిమాలోని సన్నివేశాన్ని షేర్ చేశారు.