మన దగ్గర లభించే చేపలు వందల్లో.. మహా అయితే వేలల్లో ధర పలుకుతాయి. కానీ జపాన్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఉనాంగి ఈల్ అనే చేప మాత్రం లక్షల్లో ధర పలుకుతోంది. దీన్ని జపాన్ ఈల్ అని కూడా అంటారు. 2021లో జపాన్‌లో ఈ చేపలు అత్యధికంగా కిలో 35 వేల డాలర్లకు అమ్ముడు పోయాయి. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ. 26 లక్షలు. జపాన్‌తో పాటు కొరియా, చైనా, వియత్నాంలో కూడా ఈ చేపలు లభిస్తాయి.
మంచి నీటిలో మాత్రమే పెరిగే ఈల్ చేపలు చాలా అరుదైన రకం. వీటిని పెంచడానికి కూడా చాలా ఖర్చు, సమయం పడుతుంది. జపాన్‌లో వీటిని తినడం స్టేటస్‌లా భావిస్తారు. వీటిలో ఉండే పోషకాలు కూడా ధరకు తగ్గట్టుగానే ఉంటాయి. వీటిని వండటం కూడా సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఈల్ చేపలను వండేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్లు మాత్రమే ఈల్ చేపలను వండగలరు.
ఈల్ చేపలు మంచి నీటి నదుల ద్వారా వేరే ప్రాంతాలకు తరలి వెళ్తుంటాయి. జపాన్‌లో దీవులు ఎక్కువగా ఉన్న కారణంగా.. ఈల్ చేపలు ఇక్కడ ఎక్కవగా దొరుకుతాయి. ఈ చేప పెద్దదిగా అవడానికి ఒక సంవత్సరం సమయం పడుతుంది. దీనికి వేసే దాణా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏ ఒక్క చేపకు వ్యాధి వచ్చినా సరే.. అన్నిటికీ చాలా ఈజీగా వ్యాపిస్తుంది. అందుకే వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఎప్పటికప్పుడు వీటికి మందులు వేస్తూ పెంచాలి. ఇంత అరుదైన చేపలు కాబట్టే వీటి ధర లక్షల్లో ఉంది.