'భారత్‌తో ఎలాంటి సంబంధం కావాలో తేల్చుకోండి..' బంగ్లాదేశ్‌కు విదేశాంగ మంత్రి స్ట్రాంగ్ మెసేజ్‌..!

షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి, మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్‌-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. హిందువులపై జరుగుతున్న హింసపై భారత్‌ బంగ్లాదేశ్‌పై సీరియ‌స్‌గా ఉంది.

By Medi Samrat  Published on  24 Feb 2025 2:38 PM IST
భారత్‌తో ఎలాంటి సంబంధం కావాలో తేల్చుకోండి.. బంగ్లాదేశ్‌కు విదేశాంగ మంత్రి స్ట్రాంగ్ మెసేజ్‌..!

షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి, మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్‌-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. హిందువులపై జరుగుతున్న హింసపై భారత్‌ బంగ్లాదేశ్‌పై సీరియ‌స్‌గా ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశంతో సంబంధాల మెరుగుద‌ల‌కు ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోగా.. ప‌రిస్థితి మరింత దిగజార్చేలా వ్య‌వ‌హ‌రిస్తుంది.

ఇటీవల ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ తౌహీద్ హుస్సేన్‌ను కలిశారు. ఆ త‌ర్వాత కూడా బంగ్లాదేశ్ వ్య‌వ‌హార‌శైలి మెరుగుపడటం లేదు. సమావేశం ముగిసిన వారం తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్.. బంగ్లాదేశ్ ప్రవర్తన అంశాన్ని లేవనెత్తారు.

బంగ్లాదేశ్‌కు భార‌త్‌తో ఎలాంటి సంబంధం క‌లిగి ఉండాలనుకుంటుందో నిర్ణయించుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్‌తో మా సుదీర్ఘమైన, చాలా ప్రత్యేకమైన చరిత్ర 1971 నాటిది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని బంగ్లాదేశ్ చెప్పలేద‌ని, మరోవైపు అక్కడ జరుగుతున్న దేశీయ సంఘటనలకు భారత్‌పై నిందలు వేస్తూనే ఉందని విదేశాంగ మంత్రి అన్నారు.

మధ్యంతర ప్రభుత్వంలో.. ఏ ఒక్కరూ లేచి నిలబడలేని ప‌రిస్థితి ఉంద‌ని, ప్రతిదానికీ భారతదేశాన్ని నిందించలేరని అన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ దేశ విదేశాంగ మంత్రి నివేదికను చూస్తుంటే.. చాలా విషయాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.

ద్వైపాక్షిక సంబంధాలలో సమస్యల వెనుక రెండు కోణాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. మొదటిది మైనారిటీలపై మతపరమైన హింస. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా మన ఆలోచనను ప్రభావితం చేసింది. ఇది మనం మాట్లాడవలసిన విషయం. అది కూడా చేశాం. రెండవది బంగ్లాదేశ్ రాజకీయమని విదేశాంగ మంత్రి అన్నారు. ఇప్పుడు వాళ్ళు మనతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలి.? అన్నారు.

ఇదిలావుంటే.. ఫిబ్రవరి 25 నుంచి గౌహతిలో జరగనున్న అడ్వాంటేజ్ అస్సాం సమ్మిట్‌కు ముందు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, 45 దేశాల రాయబారులతో కలిసి సోమవారం కాజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుల సఫారీని ఆస్వాదించారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. మేము అడ్వాంటేజ్ అస్సాం కోసం ఇక్కడ ఉన్నాము. దీని తర్వాత మేము గౌహతి వెళ్తున్నాము. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు మరింత గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్క‌డ‌కు ఎక్కువ మంది పర్యాటకులను, పెట్టుబడిదారులను తీసుకురావాలన్నారు.

Next Story