హిజ్బుల్లా స్థావరాల‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 46 మంది మృతి

లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా యోధుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది

By Medi Samrat  Published on  3 Oct 2024 3:45 PM GMT
హిజ్బుల్లా స్థావరాల‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 46 మంది మృతి

లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా యోధుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన పోరులో 15 మంది యోధులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు సహా ఏడుగురు హిజ్బుల్లా కార్మికులు మరణించారు.

ఇజ్రాయెల్.. హిజ్బుల్లా బలమైన స్థావరమైన బీరుట్ శివారులోని దహియేలో కూడా క్షిపణి దాడులు చేసింది. లెబనాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 46 మంది చనిపోయారు. ఇజ్రాయెల్‌లో కూడా హిజ్బుల్లా రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడు మరణించినట్లు సమాచారం.

సిరియాలోని జబ్లే నగరంలో ఉన్న రష్యా ఎయిర్‌బేస్ సమీపంలో నిర్మించిన ఆయుధాగారంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. దక్షిణ లెబనాన్ గ్రౌండ్ ఫైటింగ్‌లో ఇజ్రాయెల్ దాడిలో ఒక సైనికుడు మరణించిన తర్వాత లెబనీస్ సైన్యం కూడా ఇజ్రాయెల్ దళాలపై ఎదురు కాల్పులు జరిపింది. ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇరుదేశాల సైన్యాల మధ్య ఎదురుకాల్పులు జరగడం ఇదే తొలిసారి.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆపాలని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. స్వతంత్ర పాలస్తీనా రాష్ట్రం ఏర్పడకుండా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప‌లేమని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదాన్ని చూసి మౌనంగా ఉండడం ఆ ప్రాంతానికి ప్రాణాంతకంగా మారుతుందని.. దోహాలో ఆయనతో పాటు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.

Next Story