గాజాపై విరుచుకుప‌డిన ఇజ్రాయిల్‌.. వైమానిక దాడులు.. 10 మంది మృతి

Israeli strikes on Gaza kill 10.ఇజ్రాయిల్‌, పాల‌స్తీనాల మ‌ధ్య మ‌రోసారి యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. పాల‌స్తీనా ప‌ట్ట‌ణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 6:52 AM IST
గాజాపై విరుచుకుప‌డిన ఇజ్రాయిల్‌.. వైమానిక దాడులు.. 10 మంది మృతి

ఇజ్రాయిల్‌, పాల‌స్తీనాల మ‌ధ్య మ‌రోసారి యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. పాల‌స్తీనా ప‌ట్ట‌ణం గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందారు. మ‌రో 55 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ లక్ష్యంగా 'ఆప‌రేష‌న్ బ్రేకింగ్ డాన్' పేరిట ఇజ్రాయిల్ ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించింది.

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో సీనియర్ మిలిటెంట్‌ను ఈ వారం ప్రారంభంలో ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్ప‌టి నుంచి ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తింది. ఈ క్ర‌మంలో ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాద గ్రూపులే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది.

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హ‌మాస్ ఆధీనంలోని ఓ భ‌వ‌న‌మే ల‌క్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ జిహాది క‌మాండ‌ర్ అల్ జ‌బారి స‌హా 8 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 55 మంది గాయ‌ప‌డిన‌ట్లు పాల‌స్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారి కూడా ఉంది.

గాజా స్ట్రిప్‌లో ఉగ్రవాద సంస్థలను ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమతించేది లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పౌరులను బెదిరిస్తామంటే కుదరదని ఆ దేశ ప్రధాని యైర్ లాపిడ్ తెలిపారు. ఇజ్రాయెల్‌కు ఎవరైనా హాని చేయాలని భావిస్తే కనుక వారెక్కడున్నా కనిపెట్టి, వారిని హ‌త‌మారుస్తామంటూ హెచ్చ‌రించారు. మ‌రోవైపు దాడుల‌కు ముందు ఇజ్రాయిల్ త‌న భూభాగంలో స‌రిహ‌ద్దుకు 80 కిలోమీట‌ర్ల లోపు ప్ర‌జ‌ల కార్య‌క‌లాపాల‌ను త‌గ్గించింది. ప్ర‌తీకార దాడుల‌కు పాల‌స్తీనా పాల్ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో స‌రిహ‌ద్దుల‌కు సైన్యాన్ని పంపింది.

ఇదిలా ఉంటే. గాజా సిటీలోని ప్రధాన షిఫా ఆస్ప‌త్రి ఎదుట‌ వందల మంది ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ వారిని గుర్తించేందుకు వారు అక్క‌డ‌కు వ‌చ్చారు. ఇజ్రాయెల్‌తో సహకరిస్తున్న పాలస్తీనియన్ ఇన్‌ఫార్మర్‌లను సూచిస్తూ "గూఢచారులపై దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు అని వారిలో ఒక‌రు అన్నారు.

Next Story