కరోనా మహమ్మారిని అంతం చేయడానికి చాలా దేశాలు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాయి. భారత్ లో ఒకానొక దశలో కరోనా కట్టడి జరిగినా.. సెకండ్ వేవ్ ఎంతో ఉధృతంగా ఉంది. దీంతో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారిపై అధికారులు భారీ జరిమానాలను విధిస్తూ ఉన్నారు. ఇక టీకా పంపిణీల్లో కూడా భారత్ లో ఎన్నో అడ్డంకులు మొదలయ్యాయి.
మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండగా.. ఇజ్రాయెల్ లో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అక్కడి ప్రజలకు ప్రభుత్వం ఫైజర్ టీకా వేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనక్కర్లేదని తేల్చి చెప్పింది. ఇంత ధైర్యంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమేమిటా అని అనుకుంటూ ఉన్నారా..? అక్కడ చాలా మందికి కరోనా టీకాలు అందడమే..! మాస్కులను తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆరోగ్య శాఖ తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోకపోయినా.. ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరింది. ఇన్‌డోర్ స్టేడియంలు వంటి ప్రదేశాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇజ్రాయెల్ చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైంది. ఆ దేశంలో 16 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు 81 శాతం మంది కరోనా టీకా తీసుకోవడంతో ప్రభుత్వం మాస్కులు అవసరం లేదని ప్రకటించింది.