పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ

Israel, Hamas agree to cease-fire to end bloody 11-day war. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

By Medi Samrat  Published on  21 May 2021 7:14 AM GMT
cease fire

మొత్తానికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శుక్రవారం ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ కాల్పుల ఒప్పందం అమలులోకి వచ్చింది. దీంతో 11 రోజుల విధ్వంశానికి తెరపడింది. ఈ హింసలో ఇప్పటికి 240 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు పక్షాల అనుమతితో ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ క్యాబినెట్ ధ్రువీకరించింది.

ప్రపంచంలోని దేశాలన్నీ ఈ దాడులు ఆపాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్‌ వినలేదు సరికదా దాడులను ఉధృతం చేసింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు అంగీకరించింది. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సారథ్యంలో జరిగిన భద్రతా కేబినెట్‌ సమావేశం దీనిపై ఆమోదం తెలిపింది.

గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న హింసలో దాదాపు 200 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేయగా, హమాస్‌ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ సేనలు దాడికి దిగాయి. ఈ హింసలో ఇరుదేశాల పౌరులు చనిపోయినప్పటికీ, వందల మంది పాలస్తీనియులు నిరాశ్రయులయ్యారు. వేల మంది ప్రజలు గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరిగింది. అగ్రారాజ్యం అమెరికా కూడా హింస తగ్గేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దాడులను తక్షణం ఆపేయాలంటూ ఇస్లామిక్‌ దేశాలు సైతం డిమాండ్‌ చేసాయి. చివరికి గల్ఫ్‌ దేశాల దౌత్యంతో కూడా తోడవ్వటంతో ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గింది. హమాస్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది.





Next Story