ఆ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్ దాడి.. ప్రకటించిన ఐసిస్
Islamic State claims attack on Kabul Gurdwara.అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ గురుద్వారా
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2022 12:50 PM ISTఅఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ గురుద్వారా లక్ష్యంగా శనివారం బాంబు పేలుళ్లు జరిగాయి. వరుస పేలుళ్లే.. కాకుండా కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. తమ సభ్యుడొకరు హిందూ, సిక్కు సహా వారికి మద్దతు ఇస్తున్నవర్గాలే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు ఐసిస్ గ్రూప్ ఇస్టామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ సభ్యులు టెలికాం గ్రూప్‌లో పోస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతిగా ఈ దాడి జరిపినట్లు వెల్లడించారు.
గురుద్వారా లక్ష్యంగా బాంబు దాడి జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని సిక్కులు, హిందువులు భారత్ కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఈ-వీసాలను మంజూరు చేస్తోంది. ఇప్పటి వరకు 111 ఈ-వీసాలను జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ దేశాలన్నీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే స్పందిన బీజేపీ వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించవని స్పష్టం చేసింది.