అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ధాటికి ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా కుప్పకూలిందని, ఆ దేశం గత్యంతరం లేక కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ప్రకటించారు. ఈ సైనిక చర్యలో ఇరాన్ నౌకాదళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా, వారి వాయుసేన, క్షిపణి కేంద్రాలు మరియు దాదాపు 80 శాతం అణు పారిశ్రామిక స్థావరాలు ధ్వంసమయ్యాయని పెంటగాన్ వెల్లడించింది. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని కోల్పోయిందని, ఇకపై వారు ఏవైనా దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్‌సెత్ హెచ్చరించారు.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అమెరికా దళాలు 13,000 పైగా లక్ష్యాలపై విరుచుకుపడ్డాయని, అమెరికా తన లక్ష్యాలన్నింటినీ అనుకున్న సమయానికి చేరుకుందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఇరాన్ దిగిరావడంతో శాంతి కోసం అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణకు మొగ్గు చూపారని అమెరికా తెలిపింది. ఈ పోరాటంలో 13 మంది అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది.