ఆప్ఘాన్‌కు ప్రపంచ దేశాల సాయం
International Aid to Afghanistan.ఆప్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు పూర్తిగా
By అంజి Published on 15 Sep 2021 5:49 AM GMTఆప్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఆహార, ఆర్థిక, మానవ, రాజకీయ, సామాజిక సంక్షోభం ఏర్పడింది. ఇదే విషయమై యూఎన్‌డీపీ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో ఆ దేశాన్ని గాడిన పెట్టేందుకు ఇంటర్నేషన్ కమ్యూనిటీ ముందుకువస్తోంది. అమెరికా సహా పలు దేశాలు 100 కోట్ల డాలర్ల సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు ఆప్ఘాన్ మీడియా తెలిపింది. ఇటీవల జెనీవాలో జరిగిన యూఎన్‌ఓ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికా 6.4 కోట్ల డాలర్ల అదనపు సాయాన్ని ప్రకటించింది. మరోవైపు చైనా దేశం సైతం 1.5 కోట్ల డాలర్లు సాయం చేసేందుకు ముందుకువచ్చింది.
ఇదే విషయానికి సంబంధించి ఆప్ఘాన్ దేశ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్, చైనా రాయబారి వాంగ్ యూతో భేటీ అయ్యారని తాలిబన్ల అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఆప్ఘాన్‌కు తాము ఇచ్చే సాయాన్ని నేరుగా కాకుండా యూఎన్‌ఓ, వివిధ స్వచ్ఛంధ సంస్థల అందించాలని చూస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చాలా దేశాలు ఆప్ఘాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. నిధుల విషయంలో వారిపై నమ్మకం లేకపోవడంతో యూఎన్‌ఓ ద్వారా తమ సాయాన్ని ఆప్ఘాన్‌కు అందించాలని చూస్తున్నాయి. యూఎన్‌ఓ సమక్షంలో ఆప్ఘాన్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దేశాలకు తాలిబన్ల ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రపంచ దేశాలు ఇచ్చే నిధులతో దేశంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామని విదేశాంగ మంత్రి తెలిపారు.