యూకే ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. యూకే ప్రధానమంత్రిగా నియమితులైన రిషి సునాక్‌కి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి శుభాకాంక్షలు తెలిపారు. అల్లుడు సునాక్ విజయంపై నారాయణమూర్తి మంగళవారం స్పందిస్తూ.. "రిషి పట్ల చాలా గర్వపడుతున్నాను. అతని విజయాన్ని కోరుకుంటున్నాను" అని అన్నారు. "రిషికి అభినందనలు. అతను యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం తన వంతు కృషి చేస్తాడని మేము విశ్వసిస్తున్నాము" అని నారాయణమూర్తి చెప్పారు. రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి. ఆమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే సమయంలో రిషితో అక్షతామూర్తికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు.
రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నిక కావడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు భారతదేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించారని, ఇంత రిషి యూకే ప్రధాని ఎన్నిక కావడం తాను ఊహించలేదని బొమ్మై అన్నారు. "నేడు భారతీయులు అన్ని రంగాలలో ఉన్నారు. అనేక దేశాలలో ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రిషి సునాక్ కొత్త బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అదృష్ట చక్రం పూర్తిగా మారిపోయింది" అని ఆయన అన్నారు. రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నిక కావడంపై.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.