Indonesia: అగ్నిపర్వతం విస్ఫోటనం.. భారీగా వెలువడుతున్న లావా, బూడిద

ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్‌ మెరాపీ పర్వతం విస్ఫోటనం చెంది.. భారీగా లావాతో నిప్పులు వెదజల్లుతోంది.

By అంజి  Published on  12 March 2023 10:21 AM IST
Indonesia, Mount Merapi volcano

ఇండోనేషియాలోని మౌంట్‌ మెరాపీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.

ఇండోనేషియాలోని ఓ భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. జావా ద్వీపంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్‌ మెరాపీ పర్వతం విస్ఫోటనం చెంది.. భారీగా లావాతో నిప్పులు వెదజల్లుతోంది. ఆ అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా, బూడిద, వేడి వాయువులు వెలువుడుతున్నాయి. దీంతో గాలిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు వరకు ధూళి మేఘాలు ఆవరించాయి. ఈ విస్ఫోటనం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్స్‌ ఏజెన్సీ అధికార ప్రతినిధి అబ్దుల్‌ ముహరీ మాట్లాడుతూ.. అగ్నిపర్వతం నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో వాయువులు వ్యాప్తి చెందాయని తెఇపారు.

అబ్దుల్‌ ముహరీ ఇంకా మాట్లాడుతూ.. ''రోజంతా లావా, బూడిద ఎగసిపడటంతో ధూళి మేఘాలు సూర్యుడిని కమ్మేశాయి. పలు గ్రామాలను బూడిద కప్పేసింది. అయితే ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు'' అని తెలిపారు. అయితే అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా స్థానికంగా పర్యాటకం, మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇండోనేషియాలోని 120 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో మెరాపీ అగ్నిపర్వతం ఒకటి. ఇది యోగ్యకర్త నగరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంది.

ఈ పర్వతం చివరిసారిగా 2020 సంవత్సరం, మార్చి నెలలో బద్దలైంది. ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద కమ్మేసింది. అంతకుముందు 2010లో ఈ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. దీంతో 347 మంది మరణించారు. సుమారు 20 వేల మందిని ఇతర గ్రామాలకు తరలించారు. ఇండోనేషియా 270 మిలియన్ల జనాభా కలిగిన ద్వీపసమూహం. ఇది తరచూగా భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలకు గురవుతుంది. ఎందుకంటే ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న గుర్రపుడెక్క ఆకారపు భూకంప రేఖల శ్రేణి "రింగ్ ఆఫ్ ఫైర్" వెంట ఉంది. జావా ద్వీపంలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం అయిన మౌంట్ సెమెరు 2021 డిసెంబర్‌లో విస్ఫోటనం చెందడంతో 48 మంది మరణించారు. 36 మంది తప్పిపోయారు.

Next Story