పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది పాటు జైలు శిక్ష విధించేలా ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్దం చేసింది. కొత్తగా తీసుకురానున్న చట్టం ప్రకారం పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం నిషేదం. భార్య లేదా భర్త లేని వారితో శృంగారంలో ఏవరైనా పాల్గొంటే దానిని వ్యభిచారం కింద పరిగణిస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. ఇది కేవలం ఇండోనేసియా పౌరులకు మాత్రమే కాదు. విదేశీయులకు కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
వీటితో పాటు ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు విధించనున్నారు. వీటి అన్నింటికి సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను ఈ నెలలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయమై దేశ ఉప న్యాయశాఖ మంత్రి ఎవడ్వార్డ్ ఒమర్ షరీఫ్ హియారిజ్ మాట్లాడుతూ.. ఇండోనేషియా విలువలకు తగినట్లుగా కొత్త చట్టం ఉండటం తమకెంతో గర్వకారణం అని అన్నారు.
వాస్తవానికి ఈ బిల్లు 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. అయితే.. దేశ వ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని మార్పులు, చేర్పులు చేసి తాజాగా నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్దమైంది.