షార్జా నుంచి భారత్ కు వస్తున్న భారత విమానం పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమాన ప్రయాణికుల్లో ఒకరు మరణించడంతో పైలట్ ఈ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్టు సమాచారం. చివరకు ఈ విమానం ఈ ఉదయం లక్నో విమానాశ్రయంలో దిగింది. షార్జా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానం కరాచీలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. 6ఇ1412 ఇండిగో విమానం తెల్లవారు జామున 4 గంటలకు పాక్ గగనతంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో విమానాన్ని కరాచీకి దారి మళ్లించినట్టు పాక్ మీడియా తెలిపింది. ఇండిగో సైతం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానానాన్ని కరాచీకి మళ్లించామని, దురదృష్టవశాత్తూ ప్రయాణికుని ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపింది. విమానాశ్రయ వైద్య సిబ్బంది వచ్చేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
గత ఏడాది నవంబరులో 179 మంది ప్రయాణికులతో ఢిల్లీకి వస్తున్న గో ఎయిర్ విమానం కూడా కరాచీ విమానాశ్రయంలోనే దిగింది. విమాన ప్రయాణికుడొకరికి గుండె పోటు రావడంతో విమానంలోనే అతనికి అత్యవసర వైద్య చికిత్స చేశారు. అయితే విమానం కరాచీ ఎయిర్ పోర్టులో దిగగానే అతడు మృతి చెందాడు.