టొరంటోలోని స్కార్‌బరో విశ్వవిద్యాలయం క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి 20 ఏళ్ల శివంక్ అవస్థి మృతి చెందడం పట్ల టొరంటోలోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. “టొరంటో విశ్వవిద్యాలయ స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి విషాదకరంగా మరణించడం పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము” అని కాన్సులేట్ Xలో పోస్ట్ చేసింది.
హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో అవస్థీపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. తుపాకీ గాయంతో బాధపడుతున్న అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి అధికారులు అక్కడికి చేరుకోగా అప్పటికే అతడు మరణించినట్లు గుర్తించారు. పోలీసులు వచ్చేలోపు నిందితులు పారిపోయారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ హత్య ఈ సంవత్సరం టొరంటోలో జరిగిన 41వ హత్యగా గుర్తించారు.