కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. భారతీయ విద్యార్థి మృతి
కెనడాలో ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు హింసాత్మకంగా దాడి చేయడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 24 July 2023 12:51 PM ISTకెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. భారతీయ విద్యార్థి మృతి
కెనడాలో ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు హింసాత్మకంగా దాడి చేయడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థి గుర్‌విందర్ నాథ్ ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన మిస్సిసాగా ఏరియాలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్‌విందర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, అతడి వెహికల్‌ని దొంగించాలని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో గుర్‌విందర్ తల, శరీర భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జూలై 14న మృతి చెందాడని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది.
పంజాబ్‌లోని కరీంపూర్ చహ్వాలా గ్రామానికి చెందిన గుర్‌విందర్.. టొరంటోలోని లాయలిస్ట్ కాలేజీలో చదువుతుండేవాడు. గుర్‌విందర్ మృతి ఎంతో బాధాకరమని, అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ సిద్ధార్థ్ నాథ్ ప్రకటించారు. గుర్‌విందర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసులో అనేక మంది అనుమానితులు ప్రమేయం ఉందని, గుర్‌విందర్ నుంచి వాహనాన్ని దొంగిలించాలనే ప్రణాళికతోనే నిందితులు పిజ్జా ఆర్డర్ చేసినట్లు పీల్ ప్రాంతీయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. దాడికి ముందు ఉంచిన పిజ్జా పిజ్జా ఆర్డర్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ను కూడా దర్యాప్తు అధికారులు పొందారు. సీసీటీవీ ఫుటేజీలో, ముదురు రంగు దుస్తులు ధరించిన పురుషుడు వాహనం నుండి బయటకు వస్తున్నట్లు కనిపించిందని.. నాథ్, అతనిపై దాడి చేసిన వ్యక్తుల మధ్య ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.
నేరం జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఓల్డ్ క్రెడిట్‌వ్యూ, ఓల్డ్ డెర్రీ రోడ్ల ప్రాంతంలో నాథ్ వాహనం వదిలివేయబడిందని పీల్ రీజినల్ పోలీస్ హోమిసైడ్ బ్యూరో ఫిల్ కింగ్ తెలిపారు. ప్రస్తుతం వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ఫిల్ కింగ్ తెలిపారు. జులై 27న గురువిందర్ మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ పరీక్షల కోసం గుర్‌విందర్ కెనడాలో ఉన్నాడని, చదువు పూర్తి కాగానే సొంతగా పిజ్జా ఔట్‌లెట్ ఓపెన్ చేయాలని కలలు కన్నాడని, అంతలోనే ఇలా జరగడం ఎంతో బాధాకరమని అతడి ఫ్రెండ్స్ తెలిపారు. గుర్‌విందర్‌పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా మిస్సిసాగాలో శనివారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు, అక్కడ 200 మందికి పైగా ప్రజలు నాథ్ మృతికి సంతాపం తెలిపారు.