కెనడాలో యూట్యూబర్ దారుణ హత్య

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ హత్యకు గురయ్యారు.

By -  Medi Samrat
Published on : 5 March 2026 6:10 PM IST

కెనడాలో యూట్యూబర్ దారుణ హత్య

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ హత్యకు గురయ్యారు. అంటారియోలోని విండ్సర్-ఎసెక్స్ ప్రాంతం పరిధిలో ఉన్న లాసెల్ టౌన్‌లోని ఆమె నివాసంలోనే హత్య జరిగింది. మార్చి 3న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో నాన్సీ గ్రెవాల్‌పై కత్తితో దాడి జరిగింది. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆమె తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు అధికారులు తెలిపారు.

నాన్సీ గ్రెవాల్ యూట్యూబర్. పంజాబ్ సమస్యలు, భారత రాజకీయాలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను చెప్పేవారు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌తో పాటు ఖలిస్థానీ ఉగ్రవాద భావజాలాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించేవారు. సమస్యలుంటే భారత్‌లోనే పరిష్కరించుకోవాలని, విదేశాల నుంచి విద్వేషం రెచ్చగొట్టవద్దని పలు సందర్భాల్లో ఆమె హితవు పలికేవారు. నాన్సీ గ్రెవాల్ కుటుంబ సభ్యులకు పోలీసులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

Next Story