Indian-origin Naureen Hassan becomes first VP, COO of Federal Reserve Bank of New York. భారత సంతతికి చెందిన మహిళకు అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది.
By Medi Samrat Published on 6 March 2021 2:32 AM GMT
భారత సంతతికి చెందిన మహిళకు అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది. ఇండో అమెరికన్ నౌరిన్ హసన్.. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదటి వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. నౌరిన్ హసన్ ఎన్నికను గవర్నర్స్ బోర్డ్ ఆమోదించినట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా న్యూయార్క్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ విలియమ్స్ మాట్లాడుతూ.. ఆమె నియామమకం ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా నౌరీన్ హసన్‌ను స్ఫూర్తిదాయకమైన నాయకురాలిగా అభివర్ణించారు. ఆమెతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.
లోకల్ ఇనిషియేటివ్స్ సపోర్ట్ కార్పొరేషన్ (ఎల్ఐఎస్‌సీ) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, న్యూయార్క్ ఫెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డెనిస్ స్కాట్ మాట్లాడుతూ.. బ్యాంక్ మిషన్, వ్యూహాత్మక ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లడంతో నౌరీన్ కీలక పాత్రను నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. నౌరీన్ హసన్‌కు ఫైనాన్షియల్ సర్వీస్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. నౌరీన్ హసన్‌కు కీలక పదవి దక్కడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.