భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 66 ఏళ్ల థర్మన్ ఆరేళ్ల పాటూ పదవిలో కొనసాగనున్నారు. సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు హలీమా యాకోబ్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన సింగపూర్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు.
థర్మన్ షణ్ముగరత్నం 70.4% ఓట్లతో దేశ అధ్యక్ష రేసులో విజయం సాధించినట్లు ఆ దేశ ఎన్నికల విభాగం ఇటీవలే ప్రకటించింది. 2011 తర్వాత ఆ దేశంలో తొలిసారిగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా సంతతి నాయకులైన ఎన్‌జి కోక్ సాంగ్, తాన్ కిన్ లియాన్‌లను ధర్మన్ షణ్ముగరత్నం ఓడించారు. వీరిద్దరికీ కేవలం 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
సింగపూర్‌కు గతంలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అధ్యక్షులు ఉన్నారు. సింగపూర్ రాజకీయ నాయకుడు, తమిళ సంతతికి చెందిన సివిల్ సర్వెంట్, S R నాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో నాథన్.. బెంజమిన్ షియర్స్‌ను ఓడించారు. ఇక దేవన్ నాయర్ సింగపూర్ మూడవ అధ్యక్షుడిగా పనిచేశారు.