మద్యం మత్తులో విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానం దిగ‌గానే షాక్‌.!

Indian man urinates on fellow passenger on board American Airlines New York-Delhi flight. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడిపై స‌హ ప్ర‌యాణికుడు మూత్ర విసర్జన చేసిన‌ ఉదంతం

By Medi Samrat  Published on  24 April 2023 7:25 PM IST
మద్యం మత్తులో విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. విమానం దిగ‌గానే షాక్‌.!

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడిపై స‌హ ప్ర‌యాణికుడు మూత్ర విసర్జన చేసిన‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీ)లో ఒక భారతీయ పౌరుడిని అరెస్టు చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వ‌స్తుండగా ఓ ప్ర‌యాణికుడు సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఏఏ 292లో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విమానం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే నిందితుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) పట్టుకుంది.

నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. సహ ప్రయాణికుడితో వాగ్వాదం జరగడంతో మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విమానం రాకముందే ఎయిర్‌లైన్స్ ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి తెలియజేసింది. అనంతరం ప్రయాణికులిద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం నవంబర్ 26న ఓ ప్రయాణికుడు విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇద్దరూ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. డిసెంబర్ 6న కూడా ఎయిరిండియా విమానంలో పారిస్ నుండి ఢిల్లీకి వస్తుండగా.. ఒక ప్రయాణికుడు ఖాళీ సీటుపై, ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేసాడు. ఆ సమయంలో మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లింది.


Next Story