భారత జెండా సహాయంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు బయట పడుతూ వస్తున్నారు. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుండి పారిపోతున్న పాకిస్తాన్, టర్కీ విద్యార్థులకు కూడా త్రివర్ణ పతాకం సహాయపడిందని భారతీయ విద్యార్థి వార్తా సంస్థ ANIకి తెలిపారు. ఉక్రెయిన్ నుండి రొమేనియాలోని బుకారెస్ట్ నగరానికి చేరుకున్న భారతీయ విద్యార్థులు మాట్లాడుతూ, భారత జెండా తమకు సహాయపడిందని, అలాగే కొంతమంది పాకిస్తాన్, టర్కీ విద్యార్థులు కూడా వివిధ చెక్‌పోస్టులను సురక్షితంగా దాటారని విద్యార్థులు తెలిపారు.
ఉక్రెయిన్‌ను వీడి సరిహద్దులకు చేరుకోవాలనుకునే భారత విద్యార్థులు మువ్వెన్నెల జెండా పట్టుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. భారత ప్రభుత్వం ఈ సూచన చేయగానే విద్యార్థులు వెంటనే మార్కెట్‌కు వెళ్లి మన జాతీయ పతాకంలోని మూడు రంగుల స్ప్రేలను కొనుగోలు చేశారు. ఆపై వాటిని వస్త్రంపై స్ప్రే చేసి జెండాను రూపొందించారు. అలా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా సరిహద్దులకు చేరుకోగలిగారు. ఉక్రెయిన్ పొరుగు దేశమైన రొమేనియాలోని బుకారెస్ట్‌కు చేరుకున్న విద్యార్థులను భారత ప్రభుత్వం విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది.