చైనా సైనికుడిని అప్పగించేసిన భారత్

Indian Army apprehends Chinese soldier near disputed Himalayan border. చైనా సైనికుడిని అప్పగించేసిన భారత్.

By Medi Samrat
Published on : 11 Jan 2021 11:28 AM

china soldier

భారత్ విషయంలో చైనా చేస్తున్న కుయుక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు భారత్ ను దెబ్బ తీద్దామా అన్నట్లుగా చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాటిని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. మరో వైపు భారత్ లోకి చైనా నుండి ఎవరైనా తప్పిపోయి వస్తూ ఉంటే వారికి ఎటువంటి హాని కూడా తలపెట్టకుండా తిరిగి పంపిస్తూ ఉంది భారత్. గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చైనా సైనికులు సరిహద్దు దాటి వచ్చిన సమయాల్లోనూ భారత్ ఎంతో సంయమనం పాటిస్తోంది. చైనా సైనికులను భారత్ తిరిగి ఆ దేశానికే అప్పగిస్తూ ఉంది. అదే తరహాలో వ్యవహరించి, చైనా సైనికుడ్ని సాగనంపింది. ఛుషుల్-మోల్దో సెక్టార్ వద్ద అతడిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అధికారులకు అప్పగించింది.

జనవరి 8న లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖకు సమీపంలో ఓ చైనా సైనికుడ్ని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడంపై సైన్యం విచారణ జరిపింది. అదే సమయంలో తమ సైనికుడు ఒకరు అదృశ్యమయ్యాడంటూ చైనా స్పందించింది. ఆ సైనికుడు తమ అధీనంలో ఉన్నాడంటూ భారత సైన్యం ప్రకటించింది. ఆ సైనికుడ్ని క్షేమంగా అప్పగించాలంటూ చైనా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆ సైనికుడిని సరిహద్దుల వద్ద చైనా బలగాలకు భద్రంగా అప్పగించింది. గతేడాది అక్టోబరులోనూ ఓ చైనా సైనికుడు ఇలాగే గీత దాటివస్తే అతడిని సైనిక లాంఛనాలతో చైనాకు అప్పగించారు.


Next Story