నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఇండో అమెరికన్ భవ్యా లాల్
Indian-American Bhavya Lal appointed acting chief of staff of Nasa. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు తదుపరి అధిపతిగా ఇండో అమెరికన్ భవ్యా లాల్.
By Medi Samrat Published on 2 Feb 2021 5:50 PM ISTఅమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు తదుపరి అధిపతిగా ఒక మహిళ రాబోతుందనే కథనాలు అమెరికా మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చాయి. జోబైడెన్ అధ్యక్షుడిగా పదవి చేపట్టడంతో ఇప్పటివరకు నాసా అధిపతిగా ఉన్న జిమ్ బ్రిండెన్‌స్టైన్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. జిమ్ స్థానంలో నాసా చీఫ్‌గా ఒక మహిళ ను ఎంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. 1958లో ఏర్పాటైన తర్వాత తొలిసారి నాసాకు ఒక మహిళాధిపతి రాబోతుందని చెప్పారు. అనుకున్నట్లుగానే నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఇండో అమెరికన్ భవ్యా లాల్ ను నియమించారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ తన టీంలో భారత సంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్ తాజాగా మరో భారత సంతతి మహిళను అత్యున్నత పదవికి నామినేట్ చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఇండో అమెరికన్ భవ్యా లాల్ నియమితులయ్యారు. ఆమెతో పాటు ఫిలిప్ థామ్సన్ వైట్ హౌస్ అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. ఇక భవ్యా లాల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార మార్పిడి బృందంలో నాసా తరఫున సభ్యురాలిగా పనిచేశారు. నాసాలో అధికారుల నియామకంలో కీలకంగా వ్యవహరించారు. నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు.
ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ విద్యను అభ్యసించిన భవ్యా 2005 నుంచి 2020 మధ్య ఎస్టీపీఐ (డిఫెన్స్ అనాలిసిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇనిస్టిట్యూట్)లో మెంబర్ గా విధులను నిర్వహించారు. స్పేస్ టెక్నాలజీ, వివిధ దేశాలతో అంతరిక్ష సంబంధ వ్యూహాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, నేషనల్ స్పేస్ కౌన్సిల్, రక్షణ విభాగం, ఇంటెలిజెన్స్ విభాగాల్లో వైట్ హౌస్ ఆమె సేవలను అందుకుంటుందని బైడెన్ టీమ్ పేర్కొంది. ఆమె ఐదు జాతీయ స్థాయి సైన్స్ కమిటీల్లో పనిచేసిన అనుభవంతో నాసా విషయంలో భవిష్యత్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై బైడెన్ కు సలహాలు, సూచనలు అందించనున్నారని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.
భవ్యా లాల్ గతంలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్మియర్ అడ్మినిస్ట్రేషన్ ఫెడరల్ సలహా కమిటీలో పనిచేస్తూ, వాణిజ్యపరంగా రిమోట్ సెన్సింగ్ విభాగంలో సలహాలు అందించారు. నాసా ఏర్పడిన 63 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ మహిళా అధిపతిగా ఎన్నికవ్వడం అందులోనూ భారత సంతతి మహిళను ఈ అత్యున్న పదవి వరించడం గౌరవంగా భావిస్తున్నారు.