టర్కీకి సహాయ సామాగ్రితో వెళ్తున్న.. భారత్ విమానానికి గగనతలం నిరాకరించిన పాక్
Indian aircraft with relief materials for Turkey denied airspace by Pakistan. భారీ భూంకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలమైపోయాయి. భూకంపాల ధాటికి వేలల్లో
By అంజి Published on 7 Feb 2023 8:21 AM GMTభారీ భూంకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలమైపోయాయి. భూకంపాల ధాటికి వేలల్లో ప్రజలు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు టర్కీ, సిరియా దేశాలను సహాయం చేస్తున్నాయి. తాజాగా టర్కీలో భూకంప బాధితులకు సహాయక సామగ్రిని తీసుకువెళుతున్న భారత ఎన్‌డిఆర్‌ఎఫ్ విమానానికి పాకిస్తాన్ ప్రభుత్వం గగనతలాన్ని నిరాకరించింది. దీంతో భారత్ పక్కదారి నుంచి టర్కీకి వెళ్లాల్సి వచ్చింది.
అంతకుముందు భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ తన దేశానికి నిధులు, సహాయ సామగ్రిని అందించడంలో భారత ప్రభుత్వం ఔదార్యాన్ని ప్రశంసిస్తూ భారతదేశాన్ని "దోస్త్"గా పేర్కొన్నారు. ఫిరత్ సునెల్ టర్కీకి సహాయం పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపాడు. "అవసరంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడి"గా పేర్కొన్నారు. టర్కీకి సహాయం చేసినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపేందుకు టర్కీ రాయబారి సోషల్ మీడియాను ఎంచుకున్నారు.
''దోస్త్ అనేది టర్కిష్, హిందీలో ఒక సాధారణ పదం.. మనకు ఒక టర్కిష్ సామెత ఉంది: "దోస్త్ కారా గుండే బెల్లి ఒలూర్" (అవసరంలో ఉన్న స్నేహితుడు నిజంగా స్నేహితుడు). చాలా ధన్యవాదాలు'' అని ఫిరత్ సునేల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. టర్కీలో 24 గంటల వ్యవధిలో మూడు విధ్వంసకర భూకంపాలు సంభవించడంతో అపార నష్టం వాటిల్లింది. సోమవారం కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతిని, మానవతావాద మద్దతును కూడా ఆయన తెలియజేశారు.
భారతదేశం టర్కీకి రెస్క్యూ, వైద్య బృందాలను పంపింది. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రభుత్వంతో సమన్వయంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, వైద్య బృందాల సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో పాటు రిలీఫ్ మెటీరియల్‌లను వెంటనే పంపాలని నిర్ణయించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) తెలిపింది. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలతో 100 మంది సిబ్బందితో కూడిన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ రెండు బృందాలు భూకంపం సంభవించిన ప్రాంతానికి సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం సిద్ధంగా ఉన్నాయని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
''శిక్షణ పొందిన వైద్యులు, అవసరమైన మందులతో పారామెడిక్స్‌తో వైద్య బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. టర్కీ ప్రభుత్వం, అంకారాలోని భారత రాయబార కార్యాలయం, ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం సమన్వయంతో రిలీఫ్ మెటీరియల్‌ను పంపడం జరుగుతుంది'' అని పీఎంవో తెలిపింది. తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు సౌత్ బ్లాక్‌లో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, NDRF, రక్షణ దళాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.
భూకంప కేంద్రం దక్షిణ మధ్య టర్కీలోని గాజియాంటెప్ నగరానికి సమీపంలో ఉంది. ఒక శతాబ్దానికి పైగా టర్కీని తాకిన అతిపెద్ద భూకంపాలలో ఇది ఒకటి. ఆ ప్రాంతమంతా ప్రకంపనలకు కారణమైంది. భవనాలు కూలిపోయాయి. భూకంపం ప్రజలను వీధుల్లోకి పారిపోయేలా చేసింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే టర్కీలో 24 అనంతర ప్రకంపనలను నమోదు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉదహరించిన యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. భూకంపం ప్రభావం సిరియా, లెబనాన్, సైప్రస్, గ్రీస్, జోర్డాన్, ఇరాక్, రొమేనియా, జార్జియా, ఈజిప్ట్‌ల వరకు కనిపించాయి. టర్కీలో సంభవించిన భారీ భూకంపం అనేక మంది ప్రాణాలను బలిగొన్నట్లు నివేదికలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తింది. అంతకుముందు రోజు ప్రధాని మోడీ ట్విట్టర్‌లోకి వెళ్లి టర్కీలో జరిగిన ప్రాణనష్టంపై సంతాపం తెలిపారు.