India Vs Canada: కెనడా ప్రజలకు వీసాల జారీ నిలిపివేసిన కేంద్రం

ఇండియాకు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

By Srikanth Gundamalla
Published on : 21 Sept 2023 4:47 PM IST

India Vs Canada, VISA Servises, Suspended, Central Govt,

 India Vs Canada: కెనడా ప్రజలకు వీసాల జారీ నిలిపివేసిన కేంద్రం

భారత్‌, కెనడా మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియాకు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయంపై విదేశాంగశాఖ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. నిర్వహణ కారణాలతో కెనడాలో వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏజెన్సీలు తెలిపాయి. తదుపరి నోటీసులు వచ్చే వరకు కెనడాలో వీసా సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఖలిస్థానీ నేత హత్య విషయంలో కెనడాతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కెనడాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వీసా సేవలను నిలిపివేస్తున్టన్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కెనడా ప్రజల వీసా అప్లికేషన్లను పరిశీలించే ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సైతం.. ఇందుకు సంబంధించి తన వెబ్​సైట్​లో నోట్ ఉంచింది. తదుపరి నోటీసుల వరకు భారత వీసా సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

అయితే..ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్దీప్‌సింగ్‌ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనే భారత్-కెనడా సంబంధాలపై ప్రభావం చూపుతోంది. హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఖలిస్థానీ హత్య తర్వాత కెనడాలో పనిచేస్తోన్న భారత అధికారని బహిష్కరించారు. దాంతో.. ఈ వివాదానికి ఆద్యం పోసినట్లు అయ్యింది. భారత్‌ కూడా కెనడాకు దీటుగానే సమాధానం చెబుతోంది. కెనడా ఆరోపణలను కొట్టిపారేస్తూ.. ఆ దేశానికి చెందిన రాయబారిని భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు.. కెనడాలో ఉన్న భారతీయులకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అక్కడున్న పౌరులు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. హింస పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ భారత పౌరులను హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేసింది.

Next Story