పాక్‌కు షాక్..లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది.
By Knakam Karthik
పాక్‌కు షాక్..లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్ అటాక్‌కు ప్లాన్ చేసింది. దీంతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ మరోసారి ఊహించని బుద్ధి చెప్పింది. నిన్న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన దాడులకు సమాధానంగా ఈ ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో లాహోర్‌లోని ఓ ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, రాడార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్ నుంచి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దీనికి కొనసాగింపుగా, నిన్న రాత్రి పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణుల సాయంతో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు సైనిక లక్ష్యాలపై దాడులకు విఫలయత్నం చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, అడంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్, భుజ్ వంటి ప్రాంతాలు ఈ లక్ష్యాలలో ఉన్నాయి. అయితే, భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ జరిపిన దాడులకు సంబంధించిన శకలాలు పలుచోట్ల లభ్యమయ్యాయని, ఇవి పాక్ దుశ్చర్యలకు నిదర్శనమని పేర్కొంది.
భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, "ఈరోజు ఉదయం భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్థాన్ ఏ స్థాయిలో, ఏ పద్ధతిలో స్పందించిందో, అదే స్థాయిలో, అదే పద్ధతిలో భారత్ ప్రతిస్పందించింది. మన దాడులతో లాహోర్‌లోని ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైందని విశ్వసనీయంగా తెలిసింది" అని పేర్కొంది.