కాబూల్‌లో భారత ఎంబసీ మూసివేత.. సిబ్బంది తరలింపు
India Evacuates Kabul Embassy.అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ దారుణ
By తోట వంశీ కుమార్
అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరి కాకుండా.. మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెపుతున్నప్పటికీ వారి మాటలను ఎవ్వరూ విశ్వసించడం లేదు. దీంతో కాబూల్‌లో ఉన్నఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు మంగళవారం భారత్ ప్రకటించింది. అక్కడ ఉన్న భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని కూడా తరలిస్తున్నారు.
భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందిని తీసుకువస్తున్నారు. సుమారు 120 మంది అధికారులు ఆ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబూల్ విమానాశ్రయానికి చాలా సురక్షితంగా భారతీయుల్ని తరలించినట్లు అధికారులు చెప్పారు. అంబాసిడర్‌తో పాటు సిబ్బంది తరలింపు ప్రక్రియ మొదలైనట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్ చేశారు. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరిందరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు.
In view of the prevailing circumstances, it has been decided that our Ambassador in Kabul and his Indian staff will move to India immediately.
— Arindam Bagchi (@MEAIndia) August 17, 2021
ఆదివారం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను చేజిక్కించుకున్నారు. దీంతో అక్కడ అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. ఇక తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు విమానాశ్రయాలకు బారులు తీస్తున్నారు.