అప్గాన్‌లో దారుణ ప‌రిస్థితులు.. పిల్ల‌ల ఆక‌లి తీర్చేందుకు కిడ్నీలు అమ్ముకొంటున్నారట‌

In Afghanistan fathers selling kidney to feed their children.అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్తం చేసుకున్న త‌రువాత‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jan 2022 7:43 AM GMT
అప్గాన్‌లో దారుణ ప‌రిస్థితులు.. పిల్ల‌ల ఆక‌లి తీర్చేందుకు కిడ్నీలు అమ్ముకొంటున్నారట‌

అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్తం చేసుకున్న త‌రువాత‌ అక్క‌డి ప్ర‌జ‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. తినడానికి తిండి లేక‌, చేసేందుకు ప‌ని దొర‌క్క ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. పిల్ల‌లు, పెద్ద‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. చిన్నారుల క‌డుపులు నింపేందుకు అవ‌యాలు సైతం అమ్ముకోవ‌డం అక్క‌డున్న దారుణ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు చాలా మంది అఫ్గాన్‌లు త‌మ కిడ్నీలు అమ్ముకునేందుకు ఆస్ప‌త్రుల వ‌ద్ద క్యూలో నిలబ‌డ్డ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

త‌మ కుటుంబాల‌ను పోషించుకోవ‌డానికి ఇంత‌క‌న్నా మ‌రో మార్గం లేదంటూ వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పనిచేసే సత్తా ఉన్న‌ప్ప‌టికి ప‌నులు దొర‌క్క‌.. ఒక వేళ దొరికినా.. వ‌చ్చే డ‌బ్బులు స‌రిపోక కుటుంబంలోని మ‌గ‌ళ‌వాళ్లు త‌మ కిడ్నీల‌ను అమ్ముకుంటున్నారు. ఒక్కో కిడ్నిని రూ.1.69ల‌క్ష‌లకు అమ్ముకుంటున్నారు. వ‌చ్చిన డ‌బ్బుల‌తో కొంత‌కాలం అయిన తమ కుటుంబం కొన్ని రోజులు మూడు పూటలా అన్నం తినగలుగుతుందని వారు అంటున్నారు.

ముఖ్య‌మంగా హెరాత్ ప్రావిన్స్‌లో గ‌త కొద్ది రోజులుగా కిడ్నీ విక్ర‌యాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కార‌ణంగా చాలా మంది కిడ్నీ అమ్ముకునేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని.. కిడ్నీ దాత‌, కొనుగోలుదారు ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఇలా జ‌రుగుతోంద‌ని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఒక్క కిడ్నీ మాత్ర‌మే కాద‌ని.. శ‌రీరంలో ఏ అవ‌య‌వం కావాల‌న్నా వారు ఇచ్చేందుకు వెనుకాడ‌డం లేద‌ని చెబుతున్నారు.

కిడ్నీ ఇచ్చిన త‌రువాత క‌నీసం సంవ‌త్స‌రం పాటు అయినా విశ్రాంతి అవ‌స‌రం అని వైద్యులు చెబుతున్నారు. అయితే.. చాలా మంది రెండు నెల‌ల‌కే దొరికిన ప‌నుల‌కు వెలుతున్నారు. త‌మ ప్రాణం క‌న్నా కుటుంబ‌మే ముఖ్య‌మ‌ని వారు అంటున్నారు. మ‌రీ ఈ దుర్భ‌ర ప‌రిస్థితుల నుంచి అఫ్గాన్ ప్ర‌జ‌లు ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలీ.

ఇక అఫ్గానిస్థాన్‌లో ఆకలి సునామీ రాబోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్ పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి తక్షణమే మానవతా సాయం అందించాలని ఆఫ్గాన్ లోని డబ్ల్యూ ఎఫ్ పి ప్రతినిధి మేరీ ఎల్లెన్ మెక్ గ్రోర్టీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రస్తుతం 2.78 కోట్ల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని, ఇందులో 87 లక్షల మంది ఆకలి చావులకు చేరువయ్యారని ఆమె వాపోయారు.

Next Story