బాలీవుడ్ సినిమా సీన్ ను పోస్టు చేసి డిలీట్ చేసేసిన ఇమ్రాన్ ఖాన్.. ఎందుకో..!
Imran Khan uses Bollywood movie clip . తాజాగా పాకిస్థాన్ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ బాలీవుడ్ వీడియోను పోస్టు చేశారు. అందులో రాజకీయాలకు సంబంధించిన డైలాగులు
By Medi Samrat Published on 21 April 2021 3:40 PM ISTపాకిస్థాన్ లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలను చూస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే..! హిందీ సినిమాలన్నా, సీరియల్స్ అయినా వారికి తెగ ఇష్టం. మన బాలీవుడ్ స్టార్స్ కు పాకిస్థాన్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆ దేశ రాజకీయ నాయకులు కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ బాలీవుడ్ వీడియోను పోస్టు చేశారు. అందులో రాజకీయాలకు సంబంధించిన డైలాగులు ఉన్నాయి. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్లుండి డిలీట్ చేసేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెబుతూ 1984 నాటి బాలీవుడ్ సినిమా 'ఇంక్విలాబ్'లోని ఓ వీడియో క్లిప్‌ను పోస్టు చేశారు. అవినీతి రాజకీయ నాయకుడిగా కనిపించిన కాదర్ ఖాన్ తన పార్టీ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజలను రెచ్చగొట్టడం ఎలా.. దేశంలో అల్లర్లు సృష్టించడం ఎలా.. వంటి విషయాలను చెబుతూ ఉంటాడు. ప్రతిపక్షాల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఇమ్రాన్ ఖాన్.. ఈ బాలీవుడ్ మూవీ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అవినీతి శక్తులు పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదిగో ఇలాగే కుట్ర చేస్తున్నాయి అంటూ కామెంట్ జతచేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి. కానీ కొద్దిసేపటికే ఆ వీడియోను ఇమ్రాన్ ఖాన్ డిలీట్ చేశారు.
ఇమ్రాన్ పోస్టు చేసిన ఈ వీడియోను స్క్రీన్ రికార్డింగ్ చేసిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్.. ప్రధాని ఇమ్రాన్‌ను రక్షించేందుకు వచ్చిన 'గుడ్ బాలీవుడ్' అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు బాలీవుడ్‌ను దిగజారిన సినీ పరిశ్రమగా పేర్కొన్న ఇమ్రాన్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలోని క్లిప్‌ను తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని విమర్శించారు.
అధికార పార్టీ పీటీఐ అభ్యర్థి, పాక్ ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ సెనేట్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇమ్రాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పి, గత నెలలో నిర్వహించిన విశ్వాస తీర్మానంలో గెలుపొందారు. ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూమెంట్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో బల పరీక్షలో సులువుగా విజయం సాధించగలిగారు. ఇప్పుడేమో దేశంలో అశాంతి కూడా నెలకొంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినిమా లోని క్లిప్పింగ్ హైలైట్ గా మారింది.
*Good Bollywood* to the rescue of PM Imran Khan. 🤷🏻♀️https://t.co/VOC9rissT8 pic.twitter.com/qFjfcpUex6
— Naila Inayat (@nailainayat) April 20, 2021