పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యం నవాజ్ పై ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముల్తాన్ ర్యాలీలో మర్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవల పాకిస్థాన్ ప్రధాని పదవి నుండి అందరూ కలిసి తొలిగించేశారు. అందులో మర్యం నవాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ముల్తాన్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మర్యం నవాజ్ ను విమర్శిస్తూ కొన్ని డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు.
'సర్గోదా ర్యాలీలో మర్యం పదేపదే ఎంతో ఇష్టంగా నా పేరును పలికింది. ఆమెకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మర్యం జాగ్రత్తగా ఉండు. నువ్వు పదే పదే నా పేరును పలికితే నీ భర్త బాధ పడతాడు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై నవాజ్ షరీఫ్ సోదరుడు, పాక్ ప్రధాని షహభాజ్ షరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఈ దేశానికి కూతురైన మర్యంపై ఇమ్రాన్ వాడిన నీచమైన భాషను అందరూ ఖండించాలని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఈ దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరాలను అతడి కామెడీ టైమింగ్ దాయలేదని చెప్పారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీ కూడా ఖండించారు. ఇళ్లలో తల్లులు, అక్కచెల్లెళ్లు ఉన్నవాళ్లు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయరని అన్నారు.