పక్షుల కళేబరాలతో నిండిపోయిన వీధులు.. కారణం అదే..!
Hundreds of birds drop dead in Rome after New Year's Eve fireworks display. కొత్త ఏడాది మొదటి రోజే ఇటలీ రాజధాని రోమ్ నగరం పక్షుల కళేబరాలతో నిండిపోయింది
By Medi Samrat Published on 3 Jan 2021 12:51 PM ISTపాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ,కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలలో పాల్గొని వారు చేస్తున్న హంగు, ఆర్భాటాలకు ఎన్నో మూగజీవాలు బలైపోతున్నాయి. ఈ విధంగా కొత్త ఏడాది మొదటి రోజే ఇటలీ రాజధాని రోమ్ నగరం మూగజీవాల కళేబరాలతో నిండిపోయింది. వందల సంఖ్యలో మూగజీవులు ప్రాణాలు కోల్పోయి నగర వీధులు వాటి కళేబరాలతో నిండిపోయింది.
ఈ విధంగా ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడానికి 100% కారణం ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు అని చెప్పవచ్చు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు రోమ్ నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున భారీ శబ్దాల ద్వారా బాణాసంచా కాల్చటం వల్ల వాటి శబ్దానికి ఎన్నో పక్షులు ప్రాణాలు పోగొట్టుకున్నాయి. మరికొన్ని బాణాసంచా కాల్చడం ద్వారా ఏర్పడిన కాలుష్యం వల్ల ప్రాణాలను కోల్పోయి నగర వీధులలో దర్శనమిచ్చాయి.
హృదయ విదారక ఘటనను సామూహిక జంతు వధగా జంతు ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. నిజానికి రోమ్ నగర ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, కాలుష్య ప్రభావం కారణాలవల్ల అక్కడి ప్రభుత్వం బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. కానీ కొత్తసంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు ప్రభుత్వం విధించిన నిబంధనలను నిర్లక్ష్యం చేస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడం కోసం పెద్ద ఎత్తున బాణాసంచాలు భారీ చప్పులతో పేల్చారు. వీటి శబ్దానికి ఎన్నో వందల సంఖ్యలో మూగజీవాలు ప్రాణాలను కోల్పోవడానికి కారణమయ్యారని జంతు ప్రేమికులు ఈ ఘటనపై ప్రేమికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.