పాకిస్తాన్‌లో పురాతన హిందూ ఆలయం ధ్వంసం
Hindu temple in Pakistan's Rawalpindi attacked by unidentified people. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఒక వందేళ్ల పురాతన హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
By Medi Samrat Published on 31 March 2021 7:40 AM ISTపాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఒక వందేళ్ల పురాతన హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రావల్పిండిలోని పురానా ఖిలా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ కోసం నిర్మాణ పనులు జరుగుతుండగా ఆదివారం సాయంత్రం దాడి జరిగినట్లు స్థానిక బనీ గాలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్‌లో నమోదయ్యింది.
పాకిస్తాన్లోని చట్టాల ప్రకారం అల్లర్లు, దైవదూషణ, అక్రమంగా గుమిగూడిన నేరాలకు గాను ఈ కేసును నమోదు చేశారు.సుమారు 74 ఏళ్లుగా మూతపడిన ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి మార్చి 24 నుంచి పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు.
నిర్మాణ పనులు మొదలైన తర్వాత ఈ చారిత్రక ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ఆక్రమణలను తొలగించారు. అయితే ఆదివారం నిర్మాణ పనులు ఆగిపోయిన తర్వాత, సాయంత్రం ఏడున్నర సమయంలో 10-15 మంది వ్యక్తులు ఆలయంలోకి చొరపడి తలుపులు విరగ్గొట్టి మెట్లు కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే ఆలయంలో మరమ్మత్తులు జరుగుతుండడం వల్ల, లోపల పూజలు జరగడం లేదు. దీంతో ఆలయంలో అసలు విగ్రహాలు గానీ, మతపరమైన సాహిత్యం కానీ లేవని పోలీసులు చెప్పారు. మైనారిటీల ఆస్తులను పర్యవేక్షించే ఈటీపీబీ ట్రస్ట్ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించిన స్థానిక పాలనా యంత్రాంగం, మరమ్మతులు చేసే పనిని ట్రస్టుకు అప్పగించింది.
నగరంలోని పురాతన ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి సుజాన్ సింగ్ హవేలీకి ఒక కిలోమీటరు పరిధిలో ఏడు చిన్న ఆలయాలకు మరమ్మతులు చేయించాలని రావల్పిండి అధికారులు నిర్ణయించారు. పురానా ఖిలా దగ్గరున్న ఈ దుర్గా ఆలయం కూడా ఆ ఏడు ఆలయాల్లో ఒకటి. అయితే ప్రాంతాన్ని ఆక్రమించిన వారు ఆలయం చుట్టు పక్కల ప్రాంతాన్నంతా వస్త్రాల మార్కెట్ లా మార్చేశారు. ఆలయం ప్రహరీ గోడ లోపల, ప్రవేశ ద్వారం దగ్గర కూడా షాపులు తెరిచారు.
ఆలయాలపై గతంలో జరిగిన దాడుల కేసును విచారించిన సుప్రీం కోర్టు దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించడం తోపాటు పురాతన ఆలయాల పరిరక్షణకు ఆయా రాష్ట్రాలలో కమిటీలు ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. హిందువులు, ముస్లింల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే పనిని ఈ సంస్థకు అప్పగించారు.