బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలకు కేవలం 48 గంటల ముందు మైమన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు. మృతుడిని బోగర్ బజార్ కూడలిలో బియ్యం వ్యాపారి సుషేన్ చంద్ర సర్కార్ (62)గా గుర్తించారు. వ్యాపారి సుషేన్ చంద్ర తన దుకాణంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. దుండగులు ఆయనను పొడిచి చంపిన తర్వాత, దుకాణం షట్టర్‌ను బయటి నుండి దించేసి పరారయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు మైనారిటీలపై దాడులు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని వారాల్లో ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరిగాయి. డిసెంబర్ 31న షరియత్‌పూర్‌లో ఒక మందుల దుకాణం యజమానిని కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆయన చికిత్స పొందుతూ జనవరి మొదటి వారంలో మరణించారు. మైమన్‌సింగ్‌లోనే ఒక గార్మెంట్ కార్మికుడిని మూకదాడిలో చంపి, నిప్పంటించిన ఘటన గత డిసెంబర్‌లో జరిగింది. జనవరి 5న జెసోర్‌లో ఒక హిందూ వ్యాపారవేత్తను బహిరంగంగా కాల్చి చంపారు.