ఇజ్రాయెల్ దాడిలో కూతురుతో సహా హతమైన హిజ్బుల్లా చీఫ్
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది.
By Medi Samrat Published on 28 Sept 2024 2:46 PM ISTహిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బలగాలు క్షిపణి దాడి చేసి ఆరుగురిని హతమార్చాయి. ఈ దాడిలో హసన్ నస్రల్లా కుమార్తె జైనాబ్ నస్రల్లా కూడా మరణించారు. IDF ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేయలేడు’ అని ఐడీఎఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం వైమానిక దాడి జరిగింది. భారీ గైడెడ్ బాంబుతో జరిగిన ఈ దాడి.. భారీ శబ్దంతో బీరూట్‌ను కదిలించింది. ఈ పేలుడులో హిజ్బుల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. దాడి తర్వాత హిజ్బుల్లా కార్యాలయం కూలిన భాగం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆకాశంలో పొగ మేఘాలు వ్యాపించాయి.
అమెరికాతో సహా అనేక దేశాలు లెబనాన్‌లో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్‌ను అభ్యర్థించాయి. అయితే హిజ్బుల్లాను నిర్మూలించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పింది.