బంగ్లాదేశ్‌లో హింస, అమాయక ప్రజల మీద జరుగుతున్న దాడులకు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దోషి అని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. తాను తిరిగి వస్తానని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని షేక్ హసీనా భరోసా కల్పించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అని షేక్ హసీనా ధ్వజమెత్తారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో హసీనా జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అవామీ లీగ్ పార్టీ నాయకులు ఓపికగా ఐక్యంగా ఉండాలన్నారు.
ప్రణాళికతోనే తన తండ్రి నివాసాన్ని నాశనం చేశారని ఆరోపించారు హసీనా. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగలేదు. దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు హసీనా. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల కారణంగా 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ను వీడారు షేక్ హసీనా. హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై కేసులు నమోదయ్యాయి.