'డొంట్‌ వర్రీ.. నెక్స్ట్‌ మీరే'.. హ్యారీపాటర్‌ రచయిత్రికి బెదిరింపులు

Harry Potter author JK Rowling receives death threats. భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది.

By అంజి  Published on  14 Aug 2022 9:29 AM GMT
డొంట్‌ వర్రీ.. నెక్స్ట్‌ మీరే..  హ్యారీపాటర్‌ రచయిత్రికి బెదిరింపులు

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన రాసిన ఓ నవలపై అభ్యంతరాలు వచ్చాయి. గతంలో చాలా సార్లు సల్మాన్‌ రష్దీకి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ రష్దీపై దాడి తర్వాత.. ప్రముఖ హ్యారీపాటర్‌ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌కు చంపుతామంటూ ట్విటర్‌ వేదికగా బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. 'నెక్స్ట్ నువ్వే' అంటూ హ్యారీ పాటర్ రచయిత్రి జేకే రౌలింగ్‌కు ఓ వ్యక్తి మెసేజ్‌లు పంపాడు

అమెరికాలో రష్దీపై జరిగిప హత్యాయత్నం ఘటనపై రౌలింగ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. రష్దీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రౌలింట్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై పాకిస్తాన్‌కు చెందిన మీర్‌ ఆసిఫ్‌ అజీజ్‌ అనే వ్యక్తి స్పందించారు. 'కంగారు పడొద్దు. తర్వాత నంబర్‌ మీదే' అంటూ బెదిరింపులకు దిగాడు. అజీజ్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా ఆసిఫ్‌ అజీజ్‌ పోస్టులు పెడుతాడని అధికారులు పేర్కొన్నారు. అతని దృష్టిలో ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌, భారత్‌ ఉగ్రవాద దేశాలని, వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడని చెప్పారు. సల్మాన్‌ రష్దీపై దాడి చేసిన వ్యక్తి హదీ మటర్‌ను అజీజ్‌ ప్రశంసిస్తూ షియా యోధుడు అంటూ ట్వీట్‌ చేశాడు. తీవ్రంగా గాయపడిన సల్మాన్ నిన్నటి వరకూ వెంటిలేటర్‌పై ఉన్నారు. అయితే...ఆయన ఆరోగ్యం కాస్త మెరుగైందని, వెంటిలేటర్‌ తొలగించారని ఆయన ఏజెంట్ యాంజ్రూ వైలీ వెల్లడించారు.


Next Story