హైతీలో భారీ భూకంపం.. 304 మంది మృతి
Haiti Searches For Survivors After Earthquake Kills At Least 304.కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే ప్రకృతి
By తోట వంశీ కుమార్ Published on 15 Aug 2021 3:05 AM GMTకరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే ప్రకృతి కన్నెర జేస్తోంది. కరేబియన్ దేశమైన హైతీలో భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. భూకంపం కారణంగా ఇప్పటి వరకు అక్కడ 304 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శనివారం ఈ భారీ భూకంపం సంభవించింది. ఇక రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే చెప్పింది. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికి తరువాత వాటిని ఉపసంహరించుకున్నారు.
శనివారం తెల్లవారుజామున ఈ భారీ భూకంపం సంభవించింది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు 125 కి.మీల దూరంలో పశ్చిమ హైతిలోని సెయింట్ లూయిస్-డు-సుడ్‌కు 12 కి.మీల దూరంలో, 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే చెప్పింది. తెల్లవారు జామున ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు నేలమట్టం కాగా.. వేల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలాయి. విపత్తు బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. దాదాపు ఆస్పత్రులన్ని క్షతగాత్రులతో నిండిపోతున్నాయి. ఇప్పటి వరకు 304 మంది మృతి చెందినట్లు ఆ దేశ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. వేల సంఖ్యలో గాయపడ్డారని, వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని తెలిపింది.
ప్రకృతి విపత్తు నేపథ్యంలో హైతీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బాధితులకు సహాయం చేసేందుకు పలు బృందాలను ఏర్పాట్లు చేసినట్లు ఆదేశ ప్రధాని చెప్పారు. మృతులకు సంతాపం తెలియజేశారు. ఇక.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తక్షణ సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. హైతీకి అవసరమైన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. హైతీలో 2010లో కూడా భారీ భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7గా నమోదైంది. రెండు లక్షల మందికిపైగా మరణించగా.. మూడు లక్షల మందికిపైగా గాయపడ్డారు. 15లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న ఆ పేద దేశంపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది.