అగ్రరాజ్యం అమెరికాలో నానాటికి గన్ కల్చర్ పెరిగిపోతుంది. నెల రోజుల వ్యవధిలో న్యూయార్క్, టెక్సాస్, ఓక్లహోమాలో జరిగిన ఘటనల్లో రెండంకెల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క టెక్సాస్ ఘటనలోనే 22 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్ బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్మిత్‌బర్గ్‌లో ఉన్న కొలంబియా మెషీన్ ఫ్యాక్టరీలోకి తుపాకిలో ఓ దుండగుడు చొరబడ్డాడు. అనంతరం తుపాకీలో కాల్పులు జరపడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లో అక్కడకు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడికి గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. ఈ ఘటనపై మేరీల్యాండ్ గవర్నర్ లారీ హొగన్ మాట్లాడుతూ.. దుండుగు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించినట్లు చెప్పారు. ఎదురుకాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు దుండగుడికి గాయాలయ్యాయని తెలిపారు. అయితే..కాల్పులు జరిగిన సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. కంపెనీ వెబ్‌ప్రకారం..ఆ కంపెనీ 100 దేశాలలో వినియోగదారులకు కాంక్రీట్ తయారీ పరికారాలను సరఫరా చేస్తుంటుంది.