భారతీయులకు గుడ్ న్యూస్.. ఆ స్కిల్స్ ఉంటే చాలు.!
భారతదేశం- జర్మనీ దేశల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 2:33 AM GMTభారతదేశం- జర్మనీ దేశల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. జర్మనీ దేశం ప్రతి సంవత్సరం భారతీయులకు 90 వేల వీసాలు ఇస్తుందని చెప్పారు. జర్మన్ బిజినెస్ 2024 కు సంబందించిన 18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఒకవైపు, CEO ఫోరమ్ సమావేశం ఇక్కడ జరుగుతోంది, మరోవైపు మా నావికాదళాలు కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాయి. జర్మన్ నౌకాదళ నౌకలు ఓడరేవులో ఉన్నాయి. భారతదేశం, జర్మనీల మధ్య స్నేహం అడుగడుగునా, ప్రతి కోణంలో లోతుగా పెరుగుతోంది" అని చెప్పుకొచ్చారు. 2024వ సంవత్సరం భారత్-జర్మనీల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తవుతుందని, రాబోయే 25 ఏళ్లు ఈ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధాని మోదీ అన్నారు.
నైపుణ్యం కలిగిన భారతీయులకు వీసాలు పెంచాలన్న జర్మనీ నిర్ణయంపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. నైపుణ్యం కలిగిన భారతీయులకు ప్రతి ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని, ఇది జర్మనీ వృద్ధికి కొత్త ఊపునిస్తుందని విశ్వసిస్తున్నానన్నారు మోదీ. ఇరు దేశాల వాణిజ్యం 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ స్థాయికి చేరుకుందని, వందలాది జర్మన్ కంపెనీలు భారతదేశంలో ఉన్నాయన్నారు. భారతీయ కంపెనీలు కూడా జర్మనీలో తమ ఉనికిని వేగంగా పెంచుకుంటున్నాయని తెలిపారు. భారతదేశం కూడా ప్రపంచ వాణిజ్యం, తయారీకి కేంద్రంగా మారుతోంది, ఇది మీకు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అని ప్రధాని మోదీ అన్నారు.