భగ్గుమంటున్న బంగారం ధర.. పది గ్రాముల పసిడి రెండు లక్షలు
పాకిస్థాన్‌లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రెండు లక్షలు దాటింది
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 6:11 AM GMTప్రతీకాత్మక చిత్రం
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో పాకిస్థాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ద్రవ్యోల్భణం గత 50 సంవత్సరాల గరిష్టానికి చేరింది. ఫిబ్రవరి నెలలో ధరల సూచీ ఏకంగా 31.5శాతానికి చేరింది. దీంతో ఆదేశంలో ఏ వస్తువు కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి . లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది. ఇక బంగారం ధర గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది.
బంగారం ధర చుక్కల్ని తాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2.06లక్షలు(పాకిస్థాన్ రూపాయల్లో)లకు చేరింది. దీని బట్టి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది.
ఇక ద్రవ్యోల్భణాన్ని కారణంగా చూపుతూ గురువారం పాకిస్థాన్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేటును ఏకంగా 300 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రుణవడ్డీ రేటు 20 శాతానికి పెరిగింది. విదేశీ నిల్వలు సరిపడినన్ని లేకపోవడంతో అత్యవసర ఔషదాలు, దేశంలో ఉత్పత్తి చేసే ఇతర మెడిసిన్ ముడి సరుకును సైతం దిగుమతి చేసుకోలేక పాకిస్థాన్ విలవిలలాడుతోంది. దీంతో సరిపడినన్ని మందులు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశం దివాళా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందం కుదుర్చుకుంది. బడ్జెట్ లోటును తగ్గించుకుని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా ఇటీవల మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.