ప్రస్తుతం యువతకు సెల్ఫీలపై ఉన్న మోజు అంతా ఇంతా కాదు. అందరి కంటే తాము వెరైటీగా సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తూ.. కొందరు ప్రమాదాల బారిన పడగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూశాం. తాజగా ఓ యువకుడు జైలుకు వెళ్లాడు. తొలిసారి జైలును చూసిన ఆనందంలో వెంటనే తన ఫోన్‌లో సెల్ఫీ ఫోటోను తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అతడు చేసిన ఆ పని వల్ల జైలులో ఉన్న వందలాది గదులకు తాళాలు మార్చాల్సి వచ్చింది. ఈ ఘటన జర్మనీ దేశంలోని బెర్లిన్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెర్లిన్‌లో జేవీఏ హైడరింగ్ జైలు ఉంది. ఇటీవల ఓ యువకుడు ఇంటర్న్‌షిప్ చేయడానికి జైలుకి వెళ్లాడు. మొదటి సారి జైలును చూసిన అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాడు. ఆ తొందరలో జైలులోని మెయిన్ రూమ్ వద్ద సెల్ఫీ తీసుకుని దానిని వాట్సాప్‌లో షేర్ చేశాడు. అయితే.. ఆ సెల్ఫీలో జైలుకు సంబంధించిన మాస్టర్ తాళం చెవితో పాటు ముఖ్యమైన గదులకు సంబంధించిన తాళం చెవులు కూడా కనిపిస్తున్నాయి. అవి ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. వాటికి నకిలీ తాళం చెవులు సృష్టించగలిగేలా. ఈ విషయం జైలు అధికారుల దృష్టికి వచ్చింది. విషయం తెలిసి వారు షాక్ అయ్యారు.
వెంటనే సదరు యువకుడిని ఇంటర్న్ షిప్ నుంచి తొలగించారు. అనంతరం జైలులో ఉన్న 600 గదులకు తాళాలు, పాస్‌కోడ్‌లు మార్చేశారు. ఒకవేళ పోలీసులు ఈ విషయాన్ని గమనించకుండా ఉండి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. ఆ తాళం చెవులు ఖైదీల చేతికి అందితే వారు పారిపోయి.. మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉండేదని అక్కడి వారు అంటున్నారు. కాగా.. ఈ తాళాలు మార్చడానికి అధికారులు చాలా శ్రమించారు.