అమెరికాలో పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు.!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో పట్టుబడ్డాడు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 9:30 PM ISTగ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో పట్టుబడ్డాడు. మూలాల ప్రకారం, అన్మోల్‌ను కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నారు. అన్మోల్ తమ దేశంలో ఉన్నట్లు అమెరికా అధికారులు కొంతకాలం క్రితం ధృవీకరించారు. దీంతో అన్మోల్ బిష్ణోయ్‌ను అప్పగించాలని ముంబై పోలీసులు ప్రతిపాదన పంపారు. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత తాజాగా అన్మోల్ బిష్ణోయ్ పట్టుబడ్డ వార్త వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు, బాబా సిద్ధిఖీ హత్య కేసుతో సహా కొన్ని ఉన్నత స్థాయి నేరాలలో అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు.
అన్మోల్ బిష్ణోయ్ గురించి ఎవరైనా సమాచారం ఇస్తే ₹ 10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇటీవల ప్రకటించింది. 2022లో నమోదైన రెండు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. పరారీలో ఉన్న నేరస్థుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గత నెలలో ప్రత్యేక MCOCA కోర్టు (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్- MCOCA)లో పిటిషన్ దాఖలు చేసింది.
ఏప్రిల్ 14న బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పులకు సంబంధించి లారెన్స్, అన్మోల్ బిష్ణోయ్‌లను ముంబై పోలీసులు వాంటెడ్‌గా ప్రకటించారు. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్‌లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు అన్మోల్ బిష్ణోయ్ బాధ్యత వహించాడు. ఆ తర్వాత అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయబడింది.
అక్టోబరు 12న జీషన్ సిద్ధిఖీ కార్యాలయం సమీపంలో జరిగిన ఎన్‌సిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో సోదరులిద్దరూ కూడా నిందితులుగా ఉన్నారు. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత పూణేకు చెందిన ఓ పెద్ద నాయకుడు కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చిక్కినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేలింది. బాబా సిద్ధిఖీ హత్య కేసు దర్యాప్తులో అఫ్తాబ్ పూనావాలాను టార్గెట్ చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు తేలినందున ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య కేసులో అరెస్టయిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా చుట్టూ తీహార్ జైలు యంత్రాంగం భద్రతను పెంచింది.
అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను.. గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితుడు. 2023లో ఏజెన్సీ అతనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నివేదికల ప్రకారం, అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. అతను తన లొకేషన్‌లను మారుస్తూ ఉంటాడు. గత సంవత్సరం కెన్యా, ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడు. ఒక వార్తా కథనం ప్రకారం.. అతనిపై 18 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జోధ్‌పూర్ జైలులో శిక్షను అనుభవించాడు. అతను 7 అక్టోబర్ 2021న బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఈ ముఠా నిర్వహణలో లారెన్స్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్, అతని బంధువు సచిన్ బిష్ణోయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.లారెన్స్ బిష్ణోయ్ కటకటాల వెనుక ఉండగా.. గ్యాంగ్ ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా చూసుకునే బాధ్యతను అన్మోల్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో. దర్యాప్తు నివేదికల ప్రకారం.. లారెన్స్ బంధువు సచిన్ బిష్ణోయ్ సిద్ధూ మూసేవాలా హత్య కేసును ప్లాన్ చేయడంలో అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడు వేరే దేశంలో తలదాచుకుని అక్కడి నుంచి ముఠా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.