పాపువా న్యూ గినియాలోని ఉత్తర ప్రాంతంలోని మూడు మారుమూల గ్రామాల్లో కనీసం 26 మందిని ముఠా హత్య చేసినట్లు ఐక్యరాజ్యసమితి, పోలీసు అధికారులు తెలిపారు. "ఇది చాలా భయంకరమైన విషయం ... నేను ఆ ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు, అక్కడ పిల్లలు, పురుషులు, మహిళలు కనిపించారు. వారిని 30 మంది యువకుల బృందం చంపింది'' అని దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం యొక్క తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో తాత్కాలిక ప్రావిన్షియల్ పోలీస్ కమాండర్ జేమ్స్ బాగెన్ శుక్రవారం చెప్పారు.
గ్రామాల్లోని ఇళ్లన్నీ కాలిపోయాయని, పోలీసు స్టేషన్‌లో ఆశ్రయం పొందుతున్న మిగిలిన గ్రామస్తులు కూడా నేరస్థుల పేర్లు చెప్పడానికి భయపడుతున్నారని బాగెన్ చెప్పారు. “రాత్రి మిగిలిపోయిన కొన్ని మృతదేహాలను మొసళ్లు చిత్తడిలోకి తీసుకెళ్లాయి. వారు చంపబడిన ప్రదేశాన్ని మాత్రమే మేము చూశాము. తలలు నరికివేయబడ్డాయి” అని తెలిపారు. ఇంకా జేమ్స్ బాగెన్ మాట్లాడుతూ.. దాడి చేసినవారు దాక్కున్నారని, ఇంకా అరెస్టులు జరగలేదని చెప్పారు.
జూలై 16, జూలై 18 తేదీల్లో దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16 మంది పిల్లలతో సహా కనీసం 26 మంది మరణించినట్లు టర్క్ చెప్పారు. "తప్పిపోయిన వ్యక్తుల కోసం స్థానిక అధికారులు వెతుకుతున్నందున ఈ సంఖ్య 50కి పైగా పెరగవచ్చు. అదనంగా, 200 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లను తగలబెట్టడంతో పారిపోయారు, ”అని టర్క్ చెప్పారు.