భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి, అంటిగ్వాకు వెళ్లి.. అక్కడ కూడా కనబడకుండా పోయాడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ. ఎవరికీ చెప్పా పెట్టకుండా క్యూబా పారిపోతున్న మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 13,500 కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటిగ్వా నుంచి చోక్సీ కనపడకుండా పోయాడు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అంటిగ్వా ప్రభుత్వం అతని గురించి ఆరా తీసింది. మరోవైపు మోహుల్ చోక్సీ అదృశ్యంపై ఇప్పటికే ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఛోక్సీని మంగళవారం సాయంత్రం కరేబియన్ దీవి డొమినికాలో గుర్తించారు. పోలీసులు చూసే సమయానికి ఛోక్సీ ఏవో పత్రాలను సముద్రంలోకి విసిరేస్తూ కన్పించాడు. అనుమానం వచ్చిన పోలీసులు.. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు సైతం ఇవ్వకపోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడు ఛోక్సీ అని, ఇంటర్‌పోల్ ఎల్లో నోటీసు జారీ అయ్యిందని తెలియడంతో ఛోక్సీ తమ అధీనంలోనే ఉన్నట్లు డొమినికా ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. డొమినికాలో ఎయిర్‌పోర్టు సదుపాయం లేదు కాబట్టీ అతడు బోటు ద్వారా అక్కడకు వచ్చి ఉంటాడని తెలుస్తోంది.
అయితే ఛోక్సీ సముద్రంలోకి విసిరేసిన పత్రాలేంటో మాత్రం ఇంకా తెలియరాలేదు. చోక్సీ అప్పగింతపై అంటిగ్వా, భారత్‌కు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని డొమినికా ప్రధాని వెల్లడించారు. అంటిగ్వాతో చర్చల అనంతరం భారత్‌కు అప్పగించేందుకు సహకరిస్తామని వెల్లడించారు.
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలు దేశం విడిచి పెట్టి వెళ్లి పోయారు. నీరవ్ మోదీ లండన్‌కు పారిపోగా, చొక్సీ ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు