రాఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ యజమానుల్లో ఒకరైన ఓలివర్ దస్సాల్ట్ ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఏఎస్350 ఎక్యూరైల్ హెలికాప్టర్ ఉత్తర ఫ్రాన్స్ పరిధిలోని డేవిల్లీ సమీపంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో కుప్పకూలింది. దీంతో ఈ దుర్ఘటన జరిగింది.
రాజకీయ వేత్త కూడా అయిన ఓలివర్ మృతి పట్ల దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశంలోని పరిశ్రమలకు ఓలివర్ రారాజని కొనియాడిన ఆయన, చనిపోయేంత వరకూ ఆయన దేశానికి సేవ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.
69 ఏళ్ల ఓలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ కూడా మరణించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఫ్రాన్స్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుంటే.. డస్సౌల్ట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఓలివర్ దస్సాల్ట్.. గతంలో వ్యాపార పనుల నిమిత్తం పలుమార్లు భారత్ లోనూ పర్యటించారు. భారత్‌కు రఫేల్ యుద్ధవిమానాలను ఆ సంస్థే తయారు చేస్తోంది.