భారత్‌కు అందనున్న మరో సహాయం

France joins global call to help India.తాజాగా అమెరికా, బ్రిటన్‌ దేశాలతోబాటు తాజాగా ఫ్రాన్స్‌ కూడా ఇండియాకు సాయపడేందుకు ముందుకు వచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 2:40 AM GMT
france help to India

భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ వ‌ణికిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో భారతదేశంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత్‌లో పరిస్థితి కలచివేసే స్థితిని దాటేసిందని డబ్ల్యూ హెచ్ వో డైరెక్టర్ జనరల్ అన్నారు. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు భారత్‌కు కావలసిన సహాయం చేయడానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. వేలసంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మొబైల్ ఫీల్డ్ హాస్పిటళ్లు, ల్యాబొరేటరీ పరికరాలు.. ఇలా అత్యవసరమైన అన్నింటినీ డబ్ల్యూహెచ్‌వో అందిస్తోందన్నారు.

పోలియో, క్షయ సహా వివిధ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలకు చెందిన 2,600 మందికిపైగా నిపుణులు భారత ఆరోగ్య విభాగాలతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. గత తొమ్మిది వారాలుగా ప్రపంచంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలి ఐదు నెలల మాదిరిగానే గతవారం పాజిటివ్ కేసులు ఉన్నాయని టెడ్రోస్ పేర్కొన్నారు.

భారత్‌లోని కేసుల భారీ పెరుగుదల నిజంగా ఆశ్చర్యకరమైంది అని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ టెక్నికల్ విభాగం చీఫ్ మారియా వెన్ కెర్ఖోవే అన్నారు. ఇది భారత్‌కు మాత్రమే ప్రత్యేకం కాదని, పలు దేశాల్లోనూ ఇటువంటి పరిస్థితులే చూశామని వ్యాఖ్యానించారు. ఒకవేళ సంరక్షణ చర్యలను గాలికొదిలేస్తే చాలా దేశాల్లో ఇటువంటి దుస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం మనం తీవ్ర సంక్షోభంలో ఉన్నామని స్పష్టం చేశారు.

తాజాగా అమెరికా, బ్రిటన్‌ దేశాలతోబాటు తాజాగా ఫ్రాన్స్‌ కూడా ఇండియాకు సాయపడేందుకు ముందుకు వచ్చింది. ఇండియా ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలను ఆదుకోవడం తమ విద్యుక్త ధర్మమని ఫ్రాన్స్‌ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఈ సాయమే కాకుండా భవిష్యత్తులో మరింత సాయం చేస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ దేశం నుంచి అత్యాధునిక ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఇండియాకు చేరనున్నాయి.


Next Story