యుద్ద పీడిత ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఆపరేషన్ గంగా పేరుతో భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియన కొనసాగిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రులు హర్దీప్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్‌లను.. భారతీయ పౌరుల తరలింపు మిషన్‌ను సమన్వయం చేయడానికి, విద్యార్థులకు, ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లాలని కేంద్రం సోమవారం నిర్ణయించింది. ఈ నలుగురు మంత్రులు భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియలో పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ ఆదివారం కూడా ఉక్రెయిన్ సంక్షోభంపై సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతీయ విద్యార్థుల భద్రతను నిర్ధారించడం, వారిని అక్కడి నుండి ఖాళీ చేయడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. భారతీయ విద్యార్థుల తరలింపును వేగవంతం చేసేందుకు ఉక్రెయిన్ పొరుగు దేశాలతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.